భూములు మావి.. ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: దివిస్ ల్యాబొరేటరీస్, ఇతర కంపెనీల్లో స్థానిక యువతకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కంపెనీల ఏర్పాటుకు స్థానికుల భూములు తీసుకుని, వాటి వల్ల వచ్చే కాలుష్య ప్రభావాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు మాత్రం ఇతర రాష్ట్రాల వారికి కల్పిస్తూ తెలంగాణ యువతకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాలుష్యం కారణంగా భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయని, చదువుకున్న స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కంపెనీ యాజమాన్యాలు వెంటనే స్పందించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఓరుగంటి ఆంజనేయులు, ప్రవీణ్, ముటుకల రాజు, రాఘవ, పిల్లలమర్రి సాయి, గంగదేవి శివ, పనుగోతు తరుణ్ నాయక్, ఎర్ర శివ, గట్టు హరిసుందర్ తదితరులు పాల్గొన్నారు.
