రాంనగర్ లో విస్తృత ‘కార్డాన్ అండ్ సెర్చ్’
రాంనగర్ లో విస్తృత ‘కార్డాన్ అండ్ సెర్చ్’
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రామ్ నగర్ లో మంగళవారం, తెల్లవారుజామున చిట్యాల పోలీసులు ‘కార్డాన్ అండ్ సెర్చ్’ (సమగ్ర తనిఖీలు) ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు, చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ ఆధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రామ్ నగర్ కాలనీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రతి ఇల్లాన్ని వీధులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 20 ద్విచక్ర వాహనాలను సిఐ ఆదేశాలతో పోలీసులు జప్తు చేసి, వాటి యజమానులకు ఫైన్ విధించారు. కాలనీలో అక్రమ మద్యంపై జరిగిన తనిఖీలలో ఓర్సు సరమ్మ అనే మహిళ వద్ద లభ్యమైన 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, ఆమె పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు.
ఈ ఆపరేషన్ అనంతరం సిఐ మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు, ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. పలు కీలక అంశాల పై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు నిబంధనలు పాటించాలని, ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు ఫోన్లకు వచ్చే ఓటీపీలు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నేరాల నియంత్రణలో నిందితులను త్వరగా పట్టుకోవడంలో సీసీటీవీ మూడో కన్నులా పని చేస్తాయని, ప్రతి వీధిలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్ ,గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సిఐ కోరారు. క్షణికానందం కోసం చట్టవ్యతిరేక పనులు చేస్తూ జీవితాలను పాడుచేసుకోవద్దని, ఎలాంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సిఐ, మల్లేష్ కోరారు. ఈ తనిఖీల్లో చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్, ఎస్ఐ-2 రజన్ కుమార్, 18 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
