రైల్వే స్టేషన్‌లో చోరీ సొత్తుతో నిందితుడి అరెస్ట్..

  • రూ.1.85 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం..

( కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ) : విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీల సందర్భంగా చోరీ సొత్తుతో తిరుగుతున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1.85 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే ఐజీపీ బి. రాజకుమారి ఆదేశాలు, విజయవాడ రైల్వే జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ సూచనల మేరకు డీఎస్పీ ఆర్‌.జీ. జయసూర్య పర్యవేక్షణలో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫాం నంబర్–7 మధ్య వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దులామని సాగర్ (29)ను అదుపులోకి తీసుకుని అతని బ్యాగ్‌ను తనిఖీ చేశారు.

అందులో 16 గ్రాముల బంగారు గొలుసు, ఒక జత వెండి పట్టీలు, వెండి ఉంగరం, రెడ్‌మీ, వివో కంపెనీలకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు లభించాయి.పరిశీలనలో ఇవి జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు సంబంధించిన చోరీ సొత్తుగా గుర్తించారు. మొత్తం రూ.1.85 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జె.వి. రమణతో పాటు జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.