ఉధృతంగా పొంగిపొర్లుతున్న వాగులు

వాగుల ఉధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచివేత..

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

తాడ్వాయి, ఆంధ్రప్రభ: మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షాలతో పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంతాయిపేట భీమేశ్వర వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పశువుల కాపరులు కూడా పశువులను వాగు దాటించవద్దని ఆయన హెచ్చరించారు. వాగు ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాళోజివాడి గ్రామ సమీపంలోని వంతెన వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వాగుపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవ తీసుకోవాలని గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కోరారు.

ప్రస్తుతం వాగు ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి ప్రజల భద్రత కోసం తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.