అన్న చేతిలో తమ్ముడి హత్య..
- నిర్మల్ జిల్లాలో విషాదం
మామడ, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో పొలం ఒడ్డు వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసి తమ్ముడి హత్యకు కారణమైంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో లింబాద్రి (45) మృతి చెందగా, గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పొలం ఒడ్డు విషయంలో పెద్దోళ్ల బావన్న, తమ్ముడు లింబాద్రి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి మరోసారి జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారగా, బావన్న కత్తితో లింబాద్రిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన లింబాద్రిని కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు లింబాద్రికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై హనుమండ్లు తెలిపారు.
