నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలి

మంత్రి శ్రీధర్ బాబు

మంథనిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పరిశీలన

మంథని, ఆంధ్రప్రభ : నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రతి నిర్మాణ పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, నిర్దేశించిన గడువులోగా భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.