కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం: ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
సంస్థాగత బలోపేతంపై జిల్లా నేతలతో సమీక్ష
ఏఐసీసీ, టీపీసీసీ నివేదికలను సకాలంలో సమర్పించాలని సూచన
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ: టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణ, ఏఐసీసీ–టీపీసీసీ నివేదికల సమర్పణపై హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. టీపీసీసీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి కూచన రవళి, ట్రైనర్ పులి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి మండలం, ప్రతి డివిజన్లో పార్టీ నాయకులు ప్రజలతో నిరంతరం మమేకమై సంస్థాగత కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీలకు సమర్పించాల్సిన నివేదికలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి అందించాలని సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశం అనంతరం ‘చరక’ కార్యక్రమాన్ని నిర్వహించగా, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
