చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రైతుల ఐక్యత అవసరం: ఆకుల పాపయ్య
- ఆగస్టు 9 రైతు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు..
- రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్
ఎడపల్లి, ఆంధ్రప్రభ : గత 16 ఏళ్లుగా మూతపడిన ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే పునఃప్రారంభించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ఫ్యాక్టరీ ఆవరణలో జరగనున్న చెరుకు రైతుల సమావేశాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
సోమవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట, ఠాణాకలాన్, కుర్నాపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతుల సమావేశాల్లో ఆకుల పాపయ్య, పాల్ద రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తోందని, చెరుకు కూడా ఆరుతడి పంట కాబట్టి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ ఫ్యాక్టరీ పరిధిలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో 117 గ్రామాల రైతులు ఒకప్పుడు చెరుకు సాగు చేశారని, ప్రస్తుతం కూడా సుమారు 70 గ్రామాల రైతులు చెరుకు సాగుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉండటంతో పాటు బెల్లంపై జీఎస్టీ కూడా లేకపోవడంతో, ఈ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చి ప్రభుత్వం నిర్వహించాలని సూచించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 9న జరిగే రైతు సమావేశంలో చెరుకు సాగు చేసిన సుమారు 6 వేల మంది రైతులు, మరో 5 నుంచి 6 వేల మంది వ్యవసాయ కూలీలు, కార్మికులకు ప్రయోజనం చేకూరేలా పలు తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కుర్నాపల్లి సర్పంచ్ పరిగె సాయిలు, ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, కమలాకర్ రెడ్డి, వేల్పూర్ భూమయ్య, శ్రీనివాస్ రెడ్డి, కొట్టే గంగాధర్, సూర కిరణ్ కుమార్, టెక్మల లక్ష్మణ్, రాధాకిషన్ గౌడ్, పరిగె సుమన్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
