విద్యార్థులు భాషపై పట్టు సాధిస్తే మంచి భవిష్యత్తు..
- డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాషా విభాగం ఆధ్వర్యంలో 30 గంటల మాటతీరు (స్పోకెన్ లాంగ్వేజ్) మెరుగుపరిచే ధ్రువపత్ర శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సపావటు మాధవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు వివిధ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ఉపయోగించే భాషపై పట్టు సాధించాలంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే నాలుగు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి. సుభాషిణి మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా ప్రావీణ్యానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే భాషపై మంచి పట్టు అవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పోటీతత్వ ప్రపంచంలో రాణించాలనే లక్ష్యంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అబు బకార్, అంతర్గత నాణ్యత పరిరక్షణ విభాగం (ఐక్యూఏసీ) సమన్వయకర్త డాక్టర్ ఎస్.కే. కరిముల్లాతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
