సొసైటీ గోదాంలో రైతులకు నిల్వ సౌకర్యం

రూ.30 లక్షలతో నిర్మించిన గోదాంను ప్రారంభించిన చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్మించిన సొసైటీ గోదాం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చౌటుపల్లి సొసైటీ చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి అన్నారు.

సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన గోదాంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ ఆహార ధాన్యాల నిల్వ గోదాం ఉపయోగపడుతుందని తెలిపారు.

సొసైటీ గోదాములు రైతులకు పంట నిల్వ భద్రత కల్పించడంతో పాటు తక్కువ ధరలకు పంట విక్రయించాల్సిన పరిస్థితిని నివారిస్తాయని అన్నారు. అలాగే నిల్వ చేసిన పంట ఆధారంగా బ్యాంకులు లేదా సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీపై రుణాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మార్కెట్లో ధరలు పెరిగే వరకు పంటను గోదాంలో నిల్వ ఉంచి, అనుకూల సమయంలో మంచి ధరకు విక్రయించుకోవచ్చని తెలిపారు. గ్రామంలోనే గోదాం అందుబాటులో ఉండటంతో దూర ప్రాంతాలకు తరలించే రవాణా ఖర్చు, శ్రమ కూడా తగ్గుతుందని అన్నారు.

గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మాజీ ఎంపీ కె.ఆర్. సురేష్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కుంట ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ పరిధిలోని రైతులందరూ గోదాంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహబూబ్, వీడీసీ అధ్యక్షుడు ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ కార్యదర్శి శంకర్, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.