రైతుల పేరు చెప్పి మొరం, మట్టి మాఫియా దందా..!

రైతుల పేరు చెప్పి మొరం, మట్టి మాఫియా దందా..!

అడిగిన వారిని బెదిరిస్తున్న మొరం మాఫియా..!
రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో మొరం కుప్పలు..

వేల్పూర్‌, ఆంధ్రప్రభ: రైతు తన పొలాన్ని మెరక చేయడానికి అంటూ అధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నారు. వేల్పూర్‌ మండలం రామన్నపేట గ్రామంలో చెరువులో 5 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టికి అనుమతి తెచ్చుకుని, ఏకంగా లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా తవ్వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసినా తవ్వకాలు ఆపకుండా కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు?
తవ్విన మొరం, మట్టిని ఇటుక బట్టీలకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీ ప్రొక్లెయిన్లతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయ నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. చెరువులు, కుంటలు పూడుకుపోయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, వర్షాకాలంలో వరద ముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలైన రైతులకు పొలం మెరకకు మట్టి దొరకని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు
గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతుల పేరుతో అనుమతి తెచ్చుకుంటే తనిఖీలు తక్కువగా ఉంటాయని, స్థానికంగా అడ్డుకునే వారు ఉండరని భావించి మాఫియా ఈ దారిని ఎంచుకుంటోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో నకిలీ విత్తనాల దందా కూడా రైతుల పేరుతోనే జరుగుతోందని, మారుమూల పల్లెలను టార్గెట్‌ చేసి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని చెబుతున్నారు.

Leave a Reply