డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభం…

కృత్తివెన్ను – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రక గ్రామంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల సంక్షేమానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభవ వంటి కీలక సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.