‘ఆంధ్రప్రభ’ కథనానికి స్పందన.. ప్లాస్టిక్ నిషేధం అమలు..

గుంటూరు-కర్నూలు రహదారిపై కమిషనర్ మెరుపు దాడులు.. వ్యాపారుల్లో వణుకు


నందికొట్కూరు, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ) : నందికొట్కూరులో ప్లాస్టిక్‌ నిషేధంపై ‘ఆంధ్రప్రభ’లో నిన్న వచ్చిన కథనానికి మున్సిపల్ యంత్రాంగం తక్షణం స్పందించింది. ఇన్నాళ్లూ ప్రకటనలకే పరిమితమైన ప్లాస్టిక్ నిషేధం నేటితో అమల్లోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు కలిసి సోమవారం ఉదయం గుంటూరు-కర్నూలు రహదారిపై మెరుపు దాడులు నిర్వహించారు.రహదారి వెంబడి ఉన్న పలు దుకాణాలపై ఏకకాలంలో దాడులు చేసి నిషేధిత పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్‌ గ్లాసులు కప్పులను క్వింటాళ్ల కొద్దీ స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్న వ్యాపారులకు అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించి హెచ్చరించారు. కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ప్లాస్టిక్ నిషేధం విషయంలో ఇకపై ఉపేక్షించేది లేదు. నిన్నటి వరకు ఉన్న పరిస్థితికి నేటితో తెరపడింది. ప్లాస్టిక్ నిషేధం నేటి నుంచి సంపూర్ణంగా అమలవుతుంది. ప్రతిరోజూ తనిఖీలు ముమ్మరం చేస్తాం. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు. మరోసారి పట్టుబడితే షాపులు సీజ్‌ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తాం అని స్పష్టం చేశారు.

కమిషనర్ ఆకస్మిక దాడులు, హెచ్చరికలతో ప్లాస్టిక్‌ వ్యాపారుల్లో వణుకు మొదలైంది. నిన్నటి వరకు అధికారులకు లెక్కచేయకుండా సాగిన ప్లాస్టిక్‌ విక్రయాలకు నేటి దాడులతో బ్రేక్ పడింది.ఆంధ్రప్రభ కథనంతో మేల్కొన్న యంత్రాంగం తీరుపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ రహిత నందికొట్కూరుగా మార్చేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.