తెలంగాణలో వానల మోత!
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సోమవారం (ఆగస్టు 3) విస్తృతంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని హెచ్చరించారు. నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సమీప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్కు ప్రత్యేక సూచన
రాజధాని హైదరాబాద్లో పగటి వేళ వాతావరణం పొడిగా, ఉక్కపోతతో కొనసాగే అవకాశం ఉంది. అయితే సూర్యాస్తమయం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో పాటు, ఈదురుగాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు, ప్రయాణికులు, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
