ఆదివాసీలపై దాడి చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

  • 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ.. విరమించిన రాస్తారోకో

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి నాయకపుగూడకు చెందిన ఆదివాసీ యువకులపై అటవీ అధికారులు దాడి చేశారంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై 24 గంటల్లో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు చేపట్టిన రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం రాత్రి ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. చేపల కోసం అడవిలోని వాగు వద్దకు వెళ్లిన ఐదుగురు ఆదివాసీ యువకులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు.

ఉన్నత అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జీసీసీ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ, ఆదివాసీలపై దాడికి పాల్పడిన అటవీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు

రాస్తారోకో నేపథ్యంలో ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మందా మకరందం, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, దండేపల్లి ఎస్సై రాజవర్ధన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందునాయక్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

హామీతో ఆందోళన విరమణ

ఆదివాసీలపై దాడి చేసిన అటవీ అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హామీ ఇవ్వడంతో రాత్రి సుమారు 11.30 గంటలకు ఆదివాసీలు రాస్తారోకోను విరమించారు.