భారత్ వైపు మళ్లిన విదేశీ ఇన్వెస్టర్లు..
- జులైలో ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు
ముంబై, ఆంధ్రప్రభ : వరుసగా నాలుగు నెలల పాటు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు చేపట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జులై నెలలో మళ్లీ పెట్టుబడుల బాట పట్టారు. జులైలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రూ.20,200 కోట్ల నికర పెట్టుబడులు పెట్టినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) గణాంకాలు వెల్లడించాయి.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతీయ షేర్ల ఆకర్షణీయమైన విలువలు, కార్పొరేట్ కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి తగ్గడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడిదారులను మళ్లీ భారత మార్కెట్ వైపు మళ్లించాయి.
అయితే దీనికి ముందు నాలుగు నెలల పాటు ఎఫ్‌పీఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మార్చిలో రూ.1.17 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ.60,847 కోట్లు, మేలో రూ.32,963 కోట్లు, జూన్‌లో రూ.49,340 కోట్లు విక్రయాలు జరిపారు. అంతకుముందు ఫిబ్రవరిలో మాత్రం రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
ఈ ఏడాది నికర ఉపసంహరణ రూ.2.54 లక్షల కోట్లు
జులైలో కొనుగోళ్లు పెరిగినా, 2026లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి నికరంగా రూ.2.54 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇది 2025 మొత్తం సంవత్సరంలో నమోదైన రూ.1.66 లక్షల కోట్ల కంటే అధికం.
ఐటీ కంపెనీల అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంపై ఉన్న ఆందోళనలు తగ్గడం, డాలర్‌పై ఒత్తిడి తగ్గడం, అమెరికా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయనే అంచనాలు కూడా పెట్టుబడులకు ఊతమిచ్చాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లోనూ ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెంచారు. జులైలో సాధారణ మార్గం ద్వారా రూ.29,212 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.3,033 కోట్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు.
