సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించవచ్చు

షాపుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్‌ఐ పాండు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను సమర్థంగా నియంత్రించవచ్చని సంస్థాన్ నారాయణపురం ఎస్‌ఐ పాండు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వర్తక సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని సీసీ కెమెరాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ షాపు యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చోరీలు లేదా ఇతర నేరాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించడం సులభతరమవుతుందని తెలిపారు.

షాపు లోపల మాత్రమే కాకుండా వెనుక భాగం, రహదారి పూర్తిగా కనిపించేలా సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు. ఇప్పటివరకు 25 మంది షాపు యజమానులకు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు వంగరి రఘు, కోశాధికారి సురక్షితం, తెలంగాణ బిక్షం, ఉప్పల వెంకటేష్, చిలువేరు శంకర్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.