Indrakeeladri | ఆషాఢ సారెతో ఇంద్రకీలాద్రి కిటకిట..
- తరలివస్తున్న భక్తులు
- నేడు వీఐపీ దర్శనాలకు విరామం
- 18వ రోజు 49 సారె బృందాలతో 20,342 మంది మహిళా భక్తుల సారె సమర్పణ
- ఒక్కరోజే 45,429 మంది అమ్మవారి దర్శనం..
- 10,110 మందికి అన్నదానం
- వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు
- వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1.15 లక్షల విరాళం
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : ఆషాఢ మాస సారె ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం 49 సారె బృందాలతో 20,342 మంది మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించగా, మొత్తం 45,429 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. భారీ రద్దీ దృష్ట్యా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ప్రకటించారు.
వైభవంగా ఆషాడసారె మహోత్సవాలు..

ఆషాఢ సారె ఉత్సవాల 18వ రోజు ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో సంప్రదాయబద్ధంగా సారె సమర్పించేందుకు తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో ఆలయానికి చేరుకున్న భక్తులకు దేవస్థానం ఉచిత దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించింది.
శనివారం వివరాలు ఇలా..
దేవస్థానం గణాంకాల ప్రకారం శనివారం 45,429 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 7,835 దర్శన టికెట్లు, 66,053 ప్రసాదాల విక్రయాలు, 288 సేవలు, 1,589 తలనీలాల సమర్పణలు, 10,110 మందికి అన్నదానం, రూ.4,51,431 విరాళాలు నమోదయ్యాయి.
నేడు ప్రోటోకాల్ దర్శనాలు..

ఆదివారం భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించి దేవస్థానం ప్రత్యేక బస్సులను మాత్రమే నడపనున్నట్లు వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలతో వచ్చే తల్లులు ఉదయం 8 గంటలలోపు లేదా మధ్యాహ్నం 3 గంటల తర్వాత దర్శనానికి రావాలని సూచించారు.
వేద పరిరక్షణకు విరాళం..
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన పలగుమ్మి అఖిల్ విశ్వేశ్ కుటుంబ సభ్యులు శ్రీ కనకదుర్గమ్మవారి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1.15 లక్షల విరాళం అందజేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
