గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకుంటాం..
- కాలేశ్వరంలో నీరు నిల్వ చేస్తే ప్రమాదం
- రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు
- మాది బాధ్యత కలిగిన ప్రభుత్వం
- కృష్ణ నది జలాల కోసం పోరాడతాం..
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతులకు సాగు నీరు, తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించే విషయంలో భారత రాష్ట్ర సమితి రాజకీయాలు చేస్తుందని ఉత్తమ్ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీషావు వ్యాఖ్యలను ఖండించారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా నీటి రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 1.81 లక్షల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల నిర్మాణం పేరిట దుబారా చేసిందని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల ఫౌండె షన్ తప్పని, ఆ బ్యారేజీలు సరిగ్గా కట్టలేదన్నారు.
అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాలేశ్వరం కూలిపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారణ చేసిందని గుర్తు చేశారు. అయితే కాలేశ్వరం బ్యారేజీ షీట్ ఫైల్ ఫౌండేషన్ మార్పు చేయడంతోనే ఆ ప్రాజెక్టు కుంగిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో నీరు నిలువ చేస్తే ప్రమాదమని జాతీయ నిపుణుల సూచనల మేరకే కాలేశ్వరం ప్రాజెక్టులో నీరు నిలువ చేయలేదని చెప్పారు.
మాది బాధ్యత గల ప్రభుత్వమని, జాతీయ నిపుణుల కమిటీ సూచనల వె రకు కాలేశ్వరంలో నీరు నింపలేదని, అయినప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితోనే వ్యవసాయం సమృద్ధిగా సాగిందన్నారు. రాష్ట్రంలోని ఎల్లంపల్లి, కడెం సహా చాలా ప్రాజెక్టులను నిర్మించామని, ఇప్పటికి అవి చెక్కు చెదరలేదన్నారు.
దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ఇప్పటివరకు చెక్కు చెదరలేదన్నారు. తమ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించామని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే వరిధాన్యం కొనుగోలు చేసి రైతులకు 80వేల కోట్లను చెల్లించామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క నీటి చుక్కను కూడా వినియోగించకుండా కేవలం ఎల్లంపల్లి, ఇతర ప్రాజెక్టుల ద్వారానే ఈ స్థాయిలో పంటను పండించినట్లు గుర్తు చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి వాటా కోసం ఎలాంటి పోరాటాలైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
