పంటల బీమా నమోదు తప్పనిసరి..
- ఆగస్టు 15 వరకు గడువు పొడిగింపు
- రైతులకు ఊరటనిచ్చిన కేంద్ర నిర్ణయం..
- ప్రతి అర్హ రైతు అవకాశాన్ని వినియోగించుకోవాలి
- కేడిసిసి చైర్మన్ నెట్టెం రఘురాం
- 59 కేడీసీసీ బ్యాంకు శాఖలు, 425 పీఏసీఎస్‌ల ద్వారా బీమా నమోదు సౌకర్యం
- వర్షాభావ పరిస్థితుల్లో పంటల బీమా రైతుకు భద్రతా కవచం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని పంటలకు బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయమని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. జగ్గయ్యపేటలోని కృష్ణ సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని నెట్టెం రఘురాం పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కేంద్ర వ్యవసాయ శాఖ, బీమా సంస్థలతో సమన్వయం జరిపి రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గడువును పొడిగించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. పంటల బీమా రైతుకు భద్రతా కవచంలాంటిదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినా రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా సాగు చేసిన ప్రతి ఎకరానికి ఆగస్టు 15లోపు బీమా నమోదు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో అనుబంధంగా ఉన్న రైతులు జిల్లాలోని 59 కేడీసీసీ బ్యాంకు శాఖలు, 425 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా పంటల బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నమోదు ప్రక్రియలో పూర్తి సహకారం అందించేందుకు బ్యాంకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
అలాగే బ్యాంకు శాఖలు, పీఏసీఎస్‌లు, కామన్ సర్వీస్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు, ఎన్‌సీఐపీ మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే బీమా నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించిన నెట్టెం రఘురాం, బీమా నమోదు చేయని రైతులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సహకార సంఘాల అధ్యక్షులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
