ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ..
ముప్పాళ్ల, ఆంధ్రప్రభ : మండలంలోని గొళ్లపాడు గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజలకు విస్తృత స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అర్హులైన నిరుపేదలకు నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గొళ్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ బత్తుల నాగేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
