టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి
- రికార్డు సమయంలో 163 ఇళ్లలో ప్రచారంపూర్తి..
- పూర్తి చేసిన బూత్ కన్వీనర్‌కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సత్కారం
- నాగుల్ మీరాకు రూ.5 వేల నగదు బహుమతి, శాలువాతో ఘన సన్మానం
- ప్రతి కన్వీనర్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపు
విజయవాడ, ఆంధ్రప్రభ : తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పార్టీ కన్వీనర్లకు సూచించారు. రికార్డు సమయంలో తన పరిధిలోని అన్ని ఇళ్లలో ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసిన బూత్ కన్వీనర్‌ను శనివారం ఘనంగా సత్కరించారు.
తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లోని 14వ బూత్ కన్వీనర్ నాగుల్ మీరా తన పరిధిలోని 163 ఇళ్లు, 584 మంది ఓటర్లను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుని పార్టీ కేంద్ర కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన కరపత్రాలను పంపిణీ చేసి లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరాకు శాలువా కప్పి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు.
పార్టీ కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేసిన ఆయన సేవలను ప్రశంసిస్తూ, మిగిలిన బూత్ కన్వీనర్లు కూడా ఇదే స్ఫూర్తితో తమ పరిధిలోని ప్రతి ఇంటికి చేరుకుని డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దాసరి గాబ్రియెల్, సుగసాని కృష్ణప్రసాద్, సుగసాని రత్నశ్రీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
