జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా అవగాహన ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా అవగాహన ర్యాలీ

శ్రీ సత్యసాయి బ్యూరో. ఆంధ్రప్రభ : జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరి పట్టణంలో శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కదిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన కుటాగుళ్ల, నిజాంవలి కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, మూర్తిపల్లి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా పాల్గొని ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా కేంద్రాలకు చెందిన ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్‌ఏ (ఎం)లు, సబ్ యూనిట్ సిబ్బంది కలిసి మూర్తిపల్లి పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో అవగాహన ప్లకార్డులు పట్టుకొని “డెంగ్యూకు చెక్ పెట్టండి”, “పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి”, “దోమల నివారణే ఆరోగ్య రక్షణ” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.

ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో కదిరి పడమర సబ్ యూనిట్ అధికారి శ్రీ దేవళా నాయక్ మాట్లాడారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం నిల్వ నీటిలో పెరిగే ఏడిస్ దోమలేనని ఆయన వివరించారు. ఇంటి పరిసరాల్లో, పైకప్పులపై, ఖాళీ డబ్బాలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, కుండీలు, నీటి ట్యాంకులు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి కుండలు, డ్రమ్ములపై తప్పనిసరిగా మూతలు ఉంచాలని తెలిపారు. ప్రజలు దోమతెరలను వినియోగించడం ద్వారా దోమల కాటుకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. సాయంకాల సమయంలో వేపాకు పొగ వేయడం, దోమల నివారణ ద్రావణాలు ఉపయోగించడం, పిల్లలను పూర్తిగా కప్పే దుస్తులు వేయించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులను అరికట్టగలమని ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఎస్ (ఎం) శశి, ఎంపీహెచ్‌ఏ (ఎం) కరుణాకర రెడ్డి, నరేందర్ రెడ్డి, రవికుమార్, ప్రతాప్ రెడ్డి, మస్తాన్ వలి, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, సీ.ఓ. వనజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో సిబ్బంది మానవహారం ఏర్పాటు చేసి డెంగ్యూ నివారణపై ప్రజలకు సందేశం అందించారు. ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొని ఆరోగ్య సిబ్బంది సూచనలను శ్రద్ధగా విన్నారు.

Leave a Reply