కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి…

  • లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని రైతు, ప్రజాసంఘాల హెచ్చరిక
  • ప్రభుత్వ హామీలతో రైతులను అయోమయంలోకి నెట్టిందని రౌండ్ టేబుల్ సమావేశంలో విమర్శలు
  • 13 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు లక్షలాది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమని ఆందోళన
  • ఉచిత విద్యుత్, డీజిల్ సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పాత పంటల బీమా పునరుద్ధరణకు డిమాండ్


విజయవాడ, ఆగస్టు 1( ఆంధ్రప్రభ ): కృష్ణా డెల్టాలో వరి పంటను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు, ముఖ్యంగా 90 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులు ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్ర అనిశ్చితిలో పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖరీఫ్ సీజన్‌కు ముందే మే 1 నుంచి సాగునీరు విడుదల చేస్తామని, నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసి, ఇప్పుడు నీటి కొరతను సాకుగా చూపుతూ వరి సాగు చేయొద్దని చెప్పడం రైతాంగాన్ని మోసగించడమేనని విమర్శించారు. గత ఏడాదే ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదని, అదే నిర్లక్ష్యం నేడు డెల్టా రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని వక్తలు పేర్కొన్నారు. డెల్టా స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టుల నీటిని సక్రమంగా వినియోగించకుండా ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు.

మాజీ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పట్టిసీమ నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న కృష్ణా జలాలతో వరి సాగు సాధ్యమేనని, రైతులు వరి వేయొద్దని చెప్పడం అవగాహన లేమికి నిదర్శనమన్నారు. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా నదిపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, ఎగువ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం రైతులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు అన్నాబత్తుల శివకుమార్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, రైతు నాయకులు కొల్లా రాజమోహన్, వై. కేశవరావు తదితరులు మాట్లాడుతూ డెల్టా రైతులకు ప్రత్యామ్నాయం చూపకుండా వరిసాగు నిలిపివేయడం సరికాదన్నారు. దివిసీమ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం, బొబ్బర్లంక వద్ద కొత్త బ్యారేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రవేశపెట్టిన తీర్మానంలో తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, బోర్లు ఉన్న రైతులకు నిరంతరాయ ఉచిత విద్యుత్ అందించాలని, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో డీజిల్ సబ్సిడీ ఇవ్వాలని, వర్షాభావంతో నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని, పాత విధానంలో ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.