బట్టకాల్చి మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోం
అవినీతికి తావులేకుండా సేవలు
యూఐడీఎఫ్ టెండర్లతో సంబంధమే లేదు
అసత్యపు ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే అవినీతి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారని, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదన్నారు.
అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదని, వెంటనే లీగల్ నోటీసులు పంపాలన్నారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని, అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
అరాచక పాలనకు విసుగు చెందారు
బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం.
