గాలివాన బాధితులకు అండగా ఉంటాం: బండి సంజయ్

గాలివాన బాధితులకు అండగా ఉంటాం: బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ:

ప్రకృతి వైపరీత్యాల కారణంగా గాలివాన భీభత్సానికి రైతులతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

బుధవారం కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ 5వ డివిజన్ పరిధిలోని వడ్డెర కాలనీలో గాలివాన ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గండికోట రాజేశ్‌కు చెందిన ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కూలిపోయిన ఇంటి నిర్మాణానికి తక్షణ ఆర్థిక సహాయం అందిస్తానని, గండికోట రాజేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

నగరంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌ల పటిష్టతపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గాలివాన కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల కంటే పరస్పర విమర్శలకే పరిమితమవుతోందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అధికారికంగా లేఖ రాసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.

బీజేపీ చేపడుతున్న ఆందోళనల ఫలితంగానే కొంత మేర వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply