హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట..
- క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
- కర్నూలులో హోంగార్డ్స్ దర్బార్
- పదవీ విరమణ పొందిన హోంగార్డులకు ఘన సన్మానం.
- .హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు, ఆంధ్రప్రభ : హోంగార్డుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎ. హనుమంతు తెలిపారు. శనివారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన హోంగార్డ్స్ దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని హోంగార్డులతో ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హోంగార్డులు వినిపించిన వినతులు, సూచనలు, సమస్యలను ఓర్పుగా ఆలకించిన కమాండెంట్, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి హోంగార్డు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా మెలగడం ద్వారా శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) వంటి సామాజిక భద్రతా పథకాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, ఆక్సిస్ బ్యాంక్ అందిస్తున్న ఆరోగ్య బీమా పథకాల ద్వారా ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.

డ్రైవింగ్ విధులు నిర్వహించే హోంగార్డులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేకపోతే చట్టపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అవగాహన కల్పించారు.
పదవీ విరమణ పొందిన హోంగార్డులకు సన్మానం..

సేవలను విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందిన కె.సి. పాండురంగ, జ్ఞానరత్నమ్మ, సి. కమ్మన్నలను శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి హోంగార్డ్స్ కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానానికి అనుగుణంగా పదవీ విరమణ పొందే ప్రతి హోంగార్డుకు సమానంగా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమాండెంట్ ఎ. హనుమంతు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, ఇన్చార్జి ఆర్ఐ పోతల రాజు, సబ్‌డివిజన్ ఇన్చార్జిలు, కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.
