నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ-సర్వే
రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీఓ వెలమ శేఖర్‌రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్లోని ఐదు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీ-సర్వే కార్యక్రమానికి సంబంధించిన రైతు అవగాహన సదస్సులను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వెలమ శేఖర్‌రెడ్డి తెలిపారు.
భూముల పునఃసర్వే ప్రక్రియ, భూ హక్కుల నిర్ధారణ, రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన విధివిధానాలపై ఆయన ‘ఆంధ్రప్రభ’కు వివరాలు వెల్లడించారు.
చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, అల్లాపురం, సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని కోతులాపురం, గుడ్డిమల్కాపురం, కంకణాలగూడెం, చిమిర్యాల, భూదాన్ పోచంపల్లి మండలంలోని జగత్పల్లి, అలీనగర్, అబ్దుల్లానగర్, రాంలింగంపల్లి, హైదర్‌పూర్, వలిగొండ మండలంలోని గంగాపురం, కాశమ్మకుంట, గోపరాజుపల్లి, గురునాథ్పల్లి, రామన్నపేట మండలంలోని బి. తుర్కపల్లి, సూరారం, బాచుప్పల, నిదానపల్లి గ్రామాలను రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.
రీ-సర్వే ప్రారంభానికి ముందు గ్రామాల్లో రైతులకు అధికారికంగా నోటీసులు జారీ చేసి, వారి సమక్షంలోనే కొలతల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ముందుగా గ్రామాల మధ్య సరిహద్దులను రైతుల అంగీకారంతో ఖరారు చేసి, అనంతరం భూముల కొలతలు చేపడతామని వివరించారు.
ఉపగ్రహ ఆధారిత రోవర్ పరికరాలు, డిజిటల్ భూపటాలు, నిరంతర నిర్వహణ వ్యవస్థల సహాయంతో అత్యంత కచ్చితత్వంతో భూముల కొలతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సరిహద్దులు ఖరారైన తర్వాత ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములు, చెరువులు, కుంటలు, ఇతర నివేదిత స్థలాలను గుర్తిస్తామని చెప్పారు.
డ్రోన్ కెమెరాల ద్వారా సేకరించిన చిత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత ప్రతి భూభాగానికి ప్రామాణిక వివరాలు నమోదు చేస్తామని వెల్లడించారు.
పట్టాదారు హక్కులు స్పష్టంగా ఉండి వివాదాలు లేని భూములకు భూధార్ నంబర్ కేటాయిస్తామని తెలిపారు. భూ వివాదాలు, కోర్టు కేసులు, సరిహద్దు సమస్యలు ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్, మార్గదర్శకాల ప్రకారమే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
సర్వే ప్రక్రియలో మండల సర్వేయర్, మండల గిర్దావర్ (ఆర్ఐ), గ్రామపంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. అధికారిక ప్రకటన వెలువడిన 60 రోజులలోపు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని, వాటిని తహసీల్దార్, కొలతల విభాగాధికారి, డివిజన్ అధికారుల పర్యవేక్షణలో పరిష్కరిస్తామని చెప్పారు.
రీ-సర్వే పూర్తైన తర్వాత ప్రతి భూకమతానికి ప్రత్యేక ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్పీఎం), విశిష్ట భూమి గుర్తింపు సంఖ్య (భూధార్ నంబర్) కేటాయించి జాతీయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో అధికారిక రికార్డులు అందజేస్తామని తెలిపారు.
ఈ నూతన డిజిటల్ సర్వే విధానం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతు భూమికి స్పష్టమైన హక్కులు, రక్షణ కల్పించబడుతుందని ఆర్డీఓ వెలమ శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రైతులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆర్డీఓ వెంట డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ టంకశాల వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ శర్మ తదితరులు ఉన్నారు.
