జగిత్యాలలో వైద్య సదుపాయాల విస్తరణకు కృషి
ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్
సీఎం సహాయనిధి ద్వారా రూ.80.60 లక్షల చెక్కుల పంపిణీ
జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల పట్టణంలో వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ తెలిపారు.
శనివారం పట్టణంలోని మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.80 లక్షల 60 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం సహాయనిధి చెక్కులు జగిత్యాలకు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు.
రాష్ట్రంలో జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక మెడికల్ కళాశాల జగిత్యాలలోనే ఉందని తెలిపారు. సాధారణంగా 600 పడకలు ఉండాల్సిన చోట జగిత్యాల మెడికల్ కళాశాలలో 800కు పైగా పడకలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
డిప్లొమా ఇన్ ఈసీజీ, డయాలసిస్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, నర్సింగ్ కళాశాల ద్వారా స్టాఫ్ నర్సులు కూడా సిద్ధమవుతున్నారని చెప్పారు. అలాగే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మాతా శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని జగిత్యాలలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలి ప్రాధాన్యతతో ట్రామా సెంటర్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
పాత బస్టాండ్‌లో ట్రామా సెంటర్, వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యాలను పెంచడంతో పాటు పారామెడికల్ కోర్సులను మరింత విస్తరిస్తామని తెలిపారు. ట్రామా సెంటర్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించి ప్రాణాపాయం నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, కో-ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ముజీబ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, నాయకులు సమీండ్ల శ్రీనివాస్, ఆడువాల లక్ష్మణ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూమల రాజ్‌కుమార్, కౌన్సిలర్లు అరవ లక్ష్మి, రాజు, దయల చంద్రకళ, శంకర్, జిల్లా, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భీరం రాజేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
