ఎస్వో పై తల్లిదండ్రుల ఆగ్రహం
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన
హనుమకొండ / శాయంపేట:మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో గోడ దూకి పారిపోయిన ఆ ముగ్గురు విద్యార్ధినులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరారు. వివరాల్లోకి వెళితే.. రాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు విద్యార్థినులు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం గమనించిన విధులలో ఉన్న ఉపాధ్యాయురాలు శ్రావణి, అటెండర్ పర్విదా లు వెంటనే ప్రత్యేక అధికారి మాధవి కి సమాచారం అందించారు. దీంతో మాధవి స్థానిక పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులతో పాటు ఉదయం నాలుగు గంటలకు గురుకులంకు చేరుకున్న తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు. ఈ క్రమంలో గోవిందపూర్ కు వెళ్లే దారిలో చెట్ల పొదలలో విద్యార్థులను తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం గురుకులంకు చేరుకొని విద్యార్థుల భద్రతపై ప్రత్యేక అధికారి మాధవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని మాధవి వివరణ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి గురుకులం కు చేరుకొని వివరాలు సేకరించారు.
