రాజకీయాలకతీతంగా సంక్షేమం..

  • తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు..
  • స్వయంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
  • 19వ వార్డు మేదర బజార్‌లో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ
  • లబ్ధిదారుల ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులపై ఆరా
  • డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి హామీ
  • ఆకలితో ఉన్న నిరుపేద మహిళకు ఆహారం అందించి మానవత్వం చాటిన ఎమ్మెల్యే
  • రెండు రోజుల్లో మళ్లీ వార్డు పర్యటన చేసి అభివృద్ధి పనుల సమీక్ష


( తిరువూరు ఆంధ్రప్రభ ) : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని కేవలం నగదు అందజేతకే పరిమితం చేయకుండా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వేదికగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వినియోగించుకున్నారు. తిరువూరు పట్టణంలోని 19వ వార్డు మేదర బజార్‌లో శనివారం ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన, లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల సమర్థ అమలే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులు, పారిశుధ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.

మరో రెండు రోజుల్లో తిరిగి వార్డును సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వార్డులోని ఓ టిఫిన్ సెంటర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధి ప్రజల మధ్యే ఉండాలనే తన నమ్మకాన్ని ఆచరణలో చూపుతూ స్థానికులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా టిఫిన్ సెంటర్ సమీపంలో ఆకలితో ఉన్న ఓ నిరుపేద మహిళను గమనించిన ఎమ్మెల్యే వెంటనే ఆమెకు టిఫిన్, మంచినీరు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు.