మహిళా ఓటర్లదే పై చేయి…

  • పూర్తయిన ఓటర్ల వెరిఫికేషన్..
  • ఎన్టీఆర్ జిల్లాలో 15.90 లక్షల ఓటర్లు
  • ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
  • అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా..
  • ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపు
  • అందుబాటులో 1,936 పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా
  • 11 రకాల ధ్రువపత్రాలతో నమోదు అవకాశం
  • మైలవరంలో అత్యధికం.. నందిగామలో అత్యల్ప ఓటర్లు
  • విజయవాడ సెంట్రల్‌లో అత్యధిక సర్వీస్ ఓటర్లు
  • పారదర్శక, తప్పులులేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యం
  • జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికలకు పునాదిగా నిలిచే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియలో కీలక ఘట్టంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదుకాగా, మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండటం విశేషంగా నిలిచింది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

రాజకీయ పార్టీల సమక్షంలో..

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. జిల్లా జనాభా 24,45,334 కాగా, మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1060 మంది మహిళా ఓటర్లు ఉండగా, ప్రతి వెయ్యి మంది జనాభాకు 650 మంది ఓటర్లు నమోదయ్యారు.

అన్ని ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలన..

ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలన కోసం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాలు, సహాయ ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాలు, 1,936 పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించి అవసరమైతే కొత్తగా నమోదు, సవరణలు, తొలగింపులు, చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

ఫిర్యాదుల స్వీకరణకు ఆహ్వానం..

ఓటర్ల జాబితాకు సంబంధించి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, విచారణ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.

అర్హులందరికీ ఓటు హక్కు..

18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. కొత్తగా నమోదు కావాలనుకునే వారు ఫారం–6తో పాటు అనెక్సర్–డి సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటరు నమోదు లేదా వివరాల ధ్రువీకరణ పూర్తి చేయవచ్చని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హత ధ్రువపత్రం, పీఆర్‌సీ, కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, కుటుంబ రిజిస్టర్, భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం తదితరాలు చెల్లుబాటు అవుతాయని వివరించారు.

జిల్లాలో ఓటర్లు ఇలా..

జిల్లాలో 13,755 మంది దివ్యాంగ (పీడబ్ల్యూడీ) ఓటర్లు, 367 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. సర్వీస్ ఓటర్లలో 337 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా మైలవరంలో 2,64,459 మంది ఓటర్లతో అగ్రస్థానంలో నిలవగా, విజయవాడ సెంట్రల్లో 2,59,092 మంది, విజయవాడ తూర్పులో 2,49,985 మంది, విజయవాడ పశ్చిమలో 2,35,721 మంది, తిరువూరు (ఎస్సీ)లో 1,95,574 మంది, జగ్గయ్యపేటలో 1,93,191 మంది,నందిగామ (ఎస్సీ)లో 1,91,709 మంది ఓటర్లు నమోదయ్యారు. సర్వీస్ ఓటర్లలో విజయవాడ సెంట్రల్‌లో 67 మందితో అత్యధిక సంఖ్య నమోదు కావడం విశేషం.

పారదర్శకంగా జాబితా..

ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులులేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో సహకరిస్తే జిల్లాకు సమగ్ర, విశ్వసనీయ, తప్పులులేని ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు.