ఇంద్రకీలాద్రిపై భక్తిరస జల్లు..

  • ’ధర్మపథం’లో భరతనాట్య వైభవం
  • శాస్త్రీయ నృత్యార్చనతో అమ్మవారికి కళానీరాజనం
  • సరితా నెహ్రు బృందం అద్భుత ప్రదర్శనకు భక్తుల కరతాళధ్వనులు
  • ఆధ్యాత్మిక, భక్తి భావాలను ఆవిష్కరించిన నృత్య రూపకాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం భక్తిరసపూరిత వాతావరణంలో కొనసాగాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుని ఆలయ ప్రాంగణాన్ని కళామయంగా మార్చాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో గుడివాడకు చెందిన సరితా నెహ్రు బృందం శాస్త్రీయ నృత్యరీతులతో అమ్మవారికి నృత్యార్చన సమర్పించింది. దేవీ మహిమను, భక్తి తత్వాన్ని ప్రతిబింబించే కీర్తనలకు భావయుక్త అభినయం, లయబద్ధమైన నృత్య విన్యాసాలతో కళాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రతి ప్రదర్శన భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి కళాకారుల ప్రతిభకు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. శాస్త్రీయ కళల ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ధర్మపథం కార్యక్రమం భక్తుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. కార్యక్రమం అనంతరం ప్రదర్శన ఇచ్చిన కళాకారులను దేవస్థాన అధికారులు ఘనంగా సత్కరించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి అభినందించారు.