ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ సేవలు మరింత సులభం
- రెబ్బెనలో తొలి ధ్రువపత్రం అందజేసిన తహసీల్దార్
- అర్హులంతా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచన
రెబ్బెన, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ద్వారా ప్రభుత్వ సేవల అందజేత, కుటుంబ వివరాల ధ్రువీకరణ, పరిపాలనా ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయని రెబ్బెన తహసీల్దార్ పి. సూర్యప్రకాశ్ తెలిపారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తొలి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఎం.ఏ. జాకిర్ ఉస్మానీకి ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ఒకే అధికారిక రికార్డులో నమోదవడంతో ప్రభుత్వ సేవల అందజేత, కుటుంబ వివరాల ధ్రువీకరణ, వివిధ పరిపాలనా ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, కుటుంబ వివరాల ధ్రువీకరణ, వివిధ సర్వేల నిర్వహణ, డిజిటల్ సేవల వినియోగంలో ఈ విధానం కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబం సమీప మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, తహసీల్దార్ ఆమోదం అనంతరం అదే కేంద్రం ద్వారా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉదయ్ కిరణ్, సౌమ్య, జీపీఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
