జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేసిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వినతిపత్రంలో ప్రధానంగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. గతంలో ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటికీ చాలామందికి స్థలాలు కేటాయించలేదని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే జర్నలిస్టుల గృహనిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు, భద్రత, ఉద్యోగ పరిస్థితులు, సంక్షేమంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేసి నిర్దిష్ట గడువులో నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, అందుకు అవసరమైన కమిటీని నియమించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ మాసపత్రిక ప్రచురణను తిరిగి ప్రారంభించాలని, కొత్త జిల్లాలకు అనుగుణంగా సమాచార శాఖను బలోపేతం చేసి తగిన సిబ్బందిని నియమించాలని, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత లేదా రాయితీ ప్రయాణ సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్‌ను పునరుద్ధరించి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
అలాగే మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి జర్నలిస్టు సంఘాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టు అవార్డులను క్రమం తప్పకుండా ప్రదానం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు అమలవుతున్న బీమా పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని, వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అన్ని డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సాటి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జైచంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
