కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై సర్వత్రా హర్షం

టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనూరాధ
7వ డివిజన్ లో టీడీపీ డోర్-టు-డోర్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అధ్యక్షురాలు

( విజయవాడ, ఆంధ్రప్రభ) : కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డోర్-టు-డోర్ కార్యక్రమము ఘనంగా జరుగుతోందని, ప్రభుత్వం పనితీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారని టిడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం 7వ డివిజన్ లోని బోయపాటి మాధవరావు వీధి, అట్లూరి పరమాత్మ వీధి ప్రాంతాలలో గద్దె అనురాధ డోర్-టు-డోర్ కార్యక్రమములో పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల కూటమి పాలనపై పాంప్లెట్లను అందజేసి, ఈ కాలంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. ప్రజల నుండి ప్రభుత్వ పనితీరుగురించి, సంక్షేమం పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పనితీరుపట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు తమకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలియజేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఇటీవలే తల్లికి వందనం పడడం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఒకటవ తేదీనే పింఛన్లు పడడం లాంటివాటి పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలియజేశారు.

ఈ ప్రాంతంలో డ్రైనేజి సమస్య ఉందని కొందరు వ్యక్తం చేశారని, సదరు సమస్యను ఎమ్మెల్యే మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గద్దె అనురాధ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమంతోపాటుగా అటు అభివృద్ధి విషయంలో కూడ చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని వివరించారు. సీఎం చంద్రబాబు, ఐ.టి.శాఖ మంత్రి లోకేష్ విదేశాలు పర్యటించి పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొనివచ్చి, పెద్దఎత్తున ఉపాధి కల్పించి అభివృద్ధి చేస్తున్నారని ఆమె వివరించారు.

రాజధాని, పోలవరం నిర్మాణాలు త్వరితగతిన సాగుతున్నాయని తెలియజేశారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధంగా ఉందని గద్దె అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమములో పడమట సతీష్ చంద్ర, గుమ్మడి గురుప్రసాద్, దయాల శిరీషా గాంధీ, దోమకొండ రవి, నాగమోతు రాజా, కె.శివలక్ష్మి, పెనుగొండ శ్రీనివాస్, రెపాకుల శ్రీనివాస్, పడమట సాయిపవన్, వడ్లమూడి వంశీ, ఏసు బూత్ మరియు క్లస్టర్ ఇంఛార్జిలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.