ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్వోగా తలుపుల నాగేశ్వరరావు
బాధ్యతలు స్వీకరణ…
కలెక్టర్ తో మర్యాదపూర్వక కలయిక…
విజయవాడ, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించి, పదోన్నతిపై ఎన్టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు స్వీకరించిన తలుపుల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నూతన డీపీఆర్వోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రభుత్వం–ప్రజల మధ్య సమర్థవంతమైన వారధిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ విధానాలను వేగవంతంగా, కచ్చితంగా, విస్తృతంగా ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి లబ్ధిదారునికీ పూర్తిస్థాయిలో చేరేలా సమర్థవంతమైన సమాచార ప్రసారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సమాచార ప్రసారంలో విశ్వసనీయత, పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యమిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిలో సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక గుర్తింపు పొందేలా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో కేవీ రమణరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, వీవీ ప్రసాద్ పాల్గొన్నారు.
