తిరుపతిలో ‘మై భారత్’ కేంద్రం ఏర్పాటు..
- యువత నైపుణ్యాభివృద్ధికి కొత్త వేదిక
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లాలో యువత నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణ, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు “మై భారత్” కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో నరసింహులు, జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్, యూత్ హాస్టల్ మేనేజర్ పి. మోహన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తిరుపతి బాలాజీ కాలనీలోని యూత్ హాస్టల్‌ను “మై భారత్–తిరుపతి” ఆధ్వర్యంలోకి బదిలీ చేయాలని యూత్ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో యువజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో తిరుపతి జిల్లాకు కొత్తగా “మై భారత్” కేంద్రం మంజూరైందని కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా జిల్లా యువజన అధికారి, అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు 24 మంది జాతీయ యువ కార్యకర్తల సేవలు జిల్లాకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. యూత్ హాస్టల్‌ను యువజన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణలు, క్రీడా కార్యక్రమాలు, అడ్వెంచర్ క్యాంపులు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. వీటి ద్వారా జిల్లాలోని యువతలో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు సామాజిక బాధ్యతలపై అవగాహన కూడా పెరుగుతుందని తెలిపారు.
