ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి…

  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జి కొలనుకొండ శివాజీ
  • ప్రజా సమస్యల పరిష్కార వేదికను స్వాగతించిన కాంగ్రెస్
  • పింఛన్లు, ఉపాధి, గృహాలు, రుణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీసీసీ
  • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ : “ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించాలి. లేకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని రాజకీయంగా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ఎన్‌ఎస్‌ఎమ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. రామలింగేశ్వరనగర్, రాణిగారితోట, నెహ్రూనగర్, కట్టకింద ప్రాంతం, తారకరామానగర్, భ్రమరాంబపురం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆయన ఆరోపించారు. బ్యాంకు రుణాలు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యువత, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన శివాజీ, అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డ్వాక్రా మహిళలకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా తోట హైస్కూల్‌ను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, బస్ స్టాండ్ ఎదుట సబ్‌వే నిర్మించాలని, రాణిగారితోట నుంచి ఏలూరు రోడ్డుకు అనుసంధాన రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం, వీధి వ్యాపారులకు సబ్సిడీ రుణాలు అందించడం, కరకట్ట కింద శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టడం, ఇందిరా కాలనీ పట్టాల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణలంక రామాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం హోంగార్డు లేదా ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేలా తోట పాఠశాలలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మూడుసార్లు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించిన శివాజీ, తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.