Godavari-Delta : గోదారి డెల్టాకు ఢోకా లేదు Andhra Prabha Top News
Godavari-Delta : గోదారి డెల్టాకు ఢోకా లేదు Andhra Prabha Top News
- 10 లక్షల ఎకరాలకు భయం వద్దు
- తాగునీటికి కొరత ఉండదు
- వాటర్ మేనేజిమెంటుతో
- సూపర్ ఎల్ నినోను ఎదుర్కొంటాం
- సామర్లకోట, పిఠాపురంలో
- చివరి ఎకరాకు నీరు ఇస్తాం
- కాలువల్లో పూడిక, గుర్రపు డెక్క తొలగిస్తాం
- ఈ పనులు తక్షణమే ప్రారంభిస్తాం
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల భరోసా
( పిఠాపురం, ఆంధ్రప్రభ ప్రతినిధి )
Godavari-Delta : సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్‌లో పూడిక, గుర్రపునాచు తొలగించి, చివరి ఎకరం నీరు ఇచ్చేందుకు పనులు తక్షణమే మొదలు పెడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మొదటి రోజు సామర్లకోట లో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ జీరో పాయింట్, సామర్ల కోట, ఏలేరు కెనాల్ 2/0 రెగ్యులేటర్ ను పరిశీలించిన అనంతరం పిఠాపురం లోని ఆర్ & బి అతిథి గృహము నకు చేరుకొని ఇరిగేషన్ అధికారులతో ఏలేరు ఆయకట్టు కింద నీటి విడుదలకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన చర్యలపై సుదీర్ఘంగా అధికారులతో, రైతులతో చర్చించి తగు దిశా నిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో వల్ల తీవ్ర కరువు ఉన్నప్పటికీ, సరైన ‘వాటర్ మేనేజ్మెంట్’ ద్వారా గోదావరి డెల్టాలోని 10.60 లక్షల ఎకరాలకు సాగు,తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్ లో పూడిక, గుర్రపుడెక్క తొలగించి, చివరి ఎకరం వరకు నీరు ఇచ్చేందుకు పనులను తక్షణమే మొదలుపెడుతున్నామనన్నారు. ఏలేరు రిజర్వాయర్ లో నీళ్లు తగ్గిపోవడం తో, పురుషోత్తపట్నం ఎత్తి పోతల ద్వారా రోజుకు 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నామని తెలిపారు..సామర్లకోట నుండి పిఠాపురం బ్రాంచ్ కెనాల్ వరకు పూడికతీత, గుర్రపునాచు తొలగింపు పనులకు సంబంధించి మూడు రోజుల్లో అంచనా లు పూర్తి చేసి, యుద్ధ పాతిపదికన పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సూపర్ ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా, భూగర్భ జలాలు అడుగంటి చుక్క నీటి కోసం తల్లడిల్లుతున్న స్థితిలో కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు మరియు వాటర్ మేనేజ్మెంట్ ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని 10.6 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కెనాల్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పనుల ప్రగతిపై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో ఈస్టర్న్ కెనాల్ ద్వారా సామర్లకోట వరకు వచ్చే 48 కిలోమీటర్ల కెనాల్‌ను ఎంత ఖర్చయినా సరే ప్రక్షాళన చేయాలని ఆదేశించామని, సామర్లకోట నుంచి ప్రారంభమయ్యే 35 కిలోమీటర్ల పిబిసి (పిఠాపురం బ్రాంచ్ కెనాల్) పరిధిలో గుర్రపునాచు తొలగింపు, డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సూచించామని వివరించారు. రాబోయే 3 రోజుల్లో అంచనాలను సిద్ధం చేసుకుని పరిపాలన అనుమతులకు పంపాలని, నిధుల మంజూరు కోసం పనులు నిలపకుండా తక్షణమే ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ ప్రాంతాల్లోని టెయిల్ ఎండ్ భూములకు నీరు అందించడమే లక్ష్యమని, పిబిసి కెనాల్ ద్వారా దాదాపు 32,000 ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
అదేవిధంగా పిఠాపురం, సామర్లకోట పరిసర ప్రాంతాల్లోని డ్రెయిన్లను గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వెడల్పు చేసి ప్రక్షాళన చేయాలని ఆదేశాలు జారీ చేశా మన్నారు. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24 టిఎంసీలు కాగా, రబీ పంటలు మరియు తాగు నీటి వినియోగం తర్వాత ప్రస్తుతం కేవలం 8 టిఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులో 6 టిఎంసీలు డెడ్ స్టోరేజ్ కావడం వల్ల వినియోగానికి లభ్యంగా ఉన్నది 2 టిఎంసీలేనని తెలిపారు. అయితే విశాఖపట్నం తాగునీరు, స్టీల్ ప్లాంట్ అవసరాలకు 5 టిఎంసీలు ఇవ్వాల్సి ఉండటంతో తీవ్ర లోటు కనిపిస్తోందని, దీనికి ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాడు నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకం నుండి వచ్చే, 3,500 క్యూసెక్కులలో పుష్కర, ఎల్ఎమ్సి అవసరాలు పోనూ, 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు పంపింగ్ చేసి, కిందకు విడుదల చేస్తున్నామని చెప్పారు. జూలై నెలలో గోదావరి ఇన్-ఫ్లో గత 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత గా 8 వేల నుండి 10 వేల క్యూసెక్కులకు పడిపోవడం వంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ,లభ్యమయ్యే ప్రతి చుక్క నీటిని భద్రంగా రైతుకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రైతులు పొదుపుగా నీటిని వాడుకుంటూ వంతుల వారీ విధానానికి అలాగే ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ శాఖలతో పాటు నీటి సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ రైతు నాయకులు ఈ సంకల్పాని కి సహకరించాలని, వాతావరణ అనిశ్చితి పరిస్దితుల దృష్ట్యా, రైతులు ప్రతి ఎకరానికి కూడా క్రాప్ ఇన్స్యూరెన్స్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
