టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత

తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణ
గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని రేవంత్‌కు సూచన

హైదరాబాద్, ఆంధ్రప్రభ: గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాను అడ్డుకునేలా ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు.

తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతో గోదావరి జలాలను మళ్లించే కుట్రలు వేగవంతమయ్యాయని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ప్రశ్నిస్తూ ఫిర్యాదులు చేయడం ద్వారా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) కూడా ఆంధ్రప్రదేశ్ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

గోదావరి నదిలో తెలంగాణకు 964 టీఎంసీల జలాలపై హక్కు ఉందని, ట్రిబ్యునల్ రక్షణ కలిగిన కేటాయింపులు చెల్లవని పేర్కొంటూ తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరడం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని కవిత అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వకుండా, తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.