క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: పోలీసు శాఖలో క్రమశిక్షణే ప్రధాన బలమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక ఏఆర్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో రాజీపడకుండా అంకితభావంతో పనిచేయాలని, శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటూ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అన్నారు. విధుల నిర్వహణ, క్రమశిక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఎస్కార్ట్ డ్యూటీలు, పరేడ్ నిర్వహణతో పాటు రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.

పోలీసు సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని, సమయపాలన పాటిస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. రోజువారీ వ్యాయామం, పరేడ్, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలని, ఎస్కార్ట్ డ్యూటీల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విధులకు సంబంధించినా, వ్యక్తిగతమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించిన ఆయన, ఆగస్టు 15 వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, ప్రసాద్, కృష్ణ నాయక్‌తో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.