పొగాకు రైతులకు మూడేళ్లపాటు వడ్డీ లేని రుణం
- బ్యారెల్ కు 50 వేల వడ్డీ లేని రుణం
- “లో గ్రేడ్” పొగాకు పండించిన రైతులకు మూడేళ్లపాటు వెసులుబాటు…
- అంతర్జాతీయ పరిణామాలతో తగ్గిన ధర
- గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం
- పొగాకు బోర్డు సమావేశంలో మాట్లాడిన ఏలూరు ఎంపీ
ఏలూరు, ఆంధ్రప్రభ: పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎంపీ మహేష్ యాదవ్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ, గురువారం జరిగిన పొగాకు బోర్డుసమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో పొగాకు ధర తగ్గిపోవడం, రైతుల రుణ కష్టాలను ఎంపీ మహేష్ యాదవ్ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం సమావేశ వివరాలపై ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ, బోర్డు ఛైర్మన్, సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్యారల్ కు 50వేల వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని ఎంపీ వెల్లడించారు. దీని వల్ల “లో గ్రేడ్” పొగాకు పండించిన రైతులకు కొంతవరకూ వెసులుబాటు లభిస్తుందన్నారు.
అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది ధర బాగా తగ్గిన మాటవాస్తవమేనన్న ఎంపీ, అనుమతించిదాని కంటే రైతులు అధికంగా పండించడం కూడా సమస్యలకు కారణమవుతోందన్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఎంపీ, గిట్టుబాటు ధర కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు సంతోషంగా ఉండటమే తమ ధ్యేయం అని, గత రెండేళ్లు పొగాకుకు మంచి ధర వచ్చేందుకు కృషి చేసి గరిష్టంగా కేజికి రూ. 470 వచ్చే విధంగా చేయగలిగామని, ఈ ఏడాది కనీసం 300 పైన ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ వివరించారు.
