27–29 తేదీల్లో పవిత్రోత్సవాలు..
- ఆర్జిత సేవలకు మూడు రోజుల విరామం
- వరలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ ప్రత్యేక అలంకారం..
- సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
- శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టు వేడుకలు..
- భక్తులకు విశిష్ట ప్రసాదాల పంపిణీ
- శ్రావణమాస వైదిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని దేవస్థానం పిలుపు
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రావణమాసం ఆధ్యాత్మిక వైభవానికి వేదిక కానుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు నెలరోజులపాటు భక్తి, వైదిక సంప్రదాయాలకు ప్రతీకగా వివిధ ప్రత్యేక ఉత్సవాలు, పూజలు, వ్రతాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ వెల్లడించారు. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మీ వ్రతం, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, శ్రీకృష్ణాష్టమి ఉట్టి కొట్టు వేడుకలు భక్తి పారవశ్యాన్ని నింపనున్నాయి.
నెలరోజులు పాటు శ్రావణ వేడుకలు…

శ్రావణ శుద్ధ చతుర్దశి నుంచి బహుళ పాడ్యమి వరకు అంటే ఆగస్టు 27 నుంచి 29 వరకు త్రయాహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలను యాగశాలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. గణపతి పూజ, మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, హోమాలు, వేదపారాయణాలు, శాంతి హోమాలు, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు దేవస్థానంలోని అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేయగా, నిత్యకైంకర్యాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మను శ్రీ వరలక్ష్మీదేవిగా విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 4న నాలుగో శ్రావణ శుక్రవారం శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఆర్జిత, ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. వ్రతంలో పాల్గొనే మహిళలకు కుంకుమ, గాజులు, రవిక, శక్తి కంకణం, ప్రసాదాలను అందజేయనుండగా, ముందస్తు నమోదు సౌకర్యాన్ని దేవస్థానం కల్పించింది. అదే రోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు, గోపూజ, పురాణ ప్రవచనాలు నిర్వహించి సాయంత్రం రాజగోపురం సమీపంలో సంప్రదాయ “ఉట్టి కొట్టు” వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణమాసం సందర్భంగా నిర్వహించే ఈ విశిష్ట వైదిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారు, శ్రీ కనకదుర్గమ్మ వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
