ఇళ్లలోకి చేరిన వరద నీరు..
అవస్థలు పడుతున్న కుటుంబాలు
బకెట్లతో నీటిని బయటకు ఎత్తిపోస్తున్న మహిళలు..
సహాయక చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
దండేపల్లి, ఆంధ్రప్రభ: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దండేపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా మహిళలు బకెట్ల సహాయంతో ఇళ్లలోకి చేరిన వరద నీటిని బయటకు ఎత్తిపోస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండటంతో గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు తడిసి ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
