భక్తిశ్రద్ధలతో బండారు కార్యక్రమం
ఊర పండుగ ఏర్పాట్లకు శ్రీకారం..
ఆగస్టు 2న గ్రామదేవతల ఉత్సవాలు
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ: నిజామాబాద్ నగరంలో గురువారం భక్తిశ్రద్ధలతో బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆగస్టు 2న జరగనున్న ఊర పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సర్వ సమాజ్ కమిటీ, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పసుపు, కుంకుమ, పూలతో బండారు పోసి, కల్లు సాకలు సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం దున్నపోతును ఊరిలోకి విడిచిపెట్టారు. అలాగే గ్రామదేవతల విగ్రహాల తయారీతో పాటు ఊర పండుగ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
సర్వ సమాజ్ కమిటీ కో-కన్వీనర్ ఆదే ప్రవీణ్ మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పెద్దల నుంచి వారసత్వంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఊర పండుగ సందర్భంగా గ్రామదేవతల ఊరేగింపులో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దేవతల ఆశీర్వాదం పొందాలని కోరారు.
ఈ పండుగతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దుష్టశక్తులు దరిచేరకుండా గ్రామదేవతలు కాపాడాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోరడి కిరణ్, ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామాడుగు బాలకిషన్, కార్యదర్శి ధామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మీనారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రి స్వామి, కొరడి చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్న, జానకంపేట్ అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు.
