బీసీలకు తీరని అన్యాయం…

బీసీలకు తీరని అన్యాయం…
కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం
మరోసారి బీసీలను మోసం
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలు పూర్తిగా అమలు కాలేదు..
బీసీలకు లక్ష కోట్ల హామీ ఇచ్చి, కేవలం
3.85% (రూ.12,551 కోట్లు) మాత్రమే కేటాయింపు
వేల్పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై పలువురు వక్తలు రాజపూర్ణనందం, మొండి అశోక్, బట్టపూర్ ప్రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ఆదివారం వేల్పూర్ మండలంలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్‌లో బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ బిసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.
అధికారంలోకి రావడానికి బీసీలను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తోందని స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో గానీ, బడ్జెట్‌లో గానీ ప్రస్తావించకపోవడం బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.
ఐదు సంవత్సరాల్లో బీసీలకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఈ బడ్జెట్‌లో కేవలం 3.85% మాత్రమే కేటాయించి, అది కూడా 12,551 కోట్లకు పరిమితం చేయడం దారుణం. గత రెండు సంవత్సరాల్లో కేటాయించిన నిధుల్లో కూడా 20% కంటే తక్కువ ఖర్చు చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోంది అని విమర్శించారు. అదేవిధంగాముదిరాజ్, గంగపుత్ర,గొల్ల కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక వంటి కులాలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, ఈత చెట్ల పెంపకం, కాపు కార్పొరేషన్, చేనేత మరియు వృత్తి ఆధారిత పథకాలకు ఈ బడ్జెట్‌లో సున్నా కేటాయింపులు చేయడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధ హోదా ఇవ్వాలని ప్రకటించిన ప్రభుత్వం ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే నిధుల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో రేగుంట దేవేందర్, చౌట్పల్లి రవి, రాజా పూర్ణనందం, రేగుల్ల రాములు, మాజీ వైస్ ఎంపీపీ సురేష్, నర్సయ్య, కొత్తపల్లి అశోక్, ప్రవీణ్ యాదవ్ బట్టపూర్, రామ్ రాజ్ గౌడ్, మొండి అశోక్, శ్రీనివాస్ పాలెం, పాలేపు అశోక్, మాజీ వైస్ ఎంపీపీ సురేష్, నడ్పీ మల్లయ్య, రాజేశ్వర్, మాణిక్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
