ఓపెన్ ప్లాట్లలో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి

వర్షపు నీటి సమస్యపై పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మల్లయ్య

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: వర్షాల నేపథ్యంలో పట్టణంలోని ఓపెన్ ప్లాట్లలో నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సూచించారు.

పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు సాగర్ రోడ్డులో ఉన్న ఓపెన్ ప్లాట్లలో వర్షపు నీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కౌన్సిలర్ దొడ్డుపల్లి జగదీష్ మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో గురువారం చైర్మన్ నూగిల్ల మల్లయ్య ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఓపెన్ ప్లాట్ల యజమానులు వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కచ్చా కాలువలు ఏర్పాటు చేసి నీటి నిల్వ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డుపల్లి శేఖర్, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.