ఎత్తిపోతల పథకాలను కాపాడుకోవాలి
నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసుకుని భద్రత పెంచాలి
ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ: హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 34 ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టులను రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పరిరక్షించుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు.
ఎత్తిపోతల పథకాలు సాగునీరు అందని భూములకు నీరందించే రైతుల పాలిట దేవాలయాల వంటివని, వాటి నిర్వహణ, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఇటీవల ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ వైర్లు, మోటార్ల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్‌హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరైన నిర్వహణ, భద్రత లోపించడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఎత్తిపోతల పథకాల నిర్వహణకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. రైతులు, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను కాపాడుకోవాలని కోరారు.
సాగునీరు అందని వ్యవసాయ భూములను సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ మోహన్, ఇరిగేషన్ ఈఈ రాంకిషోర్, విద్యుత్ డీఈ రామ్మోహన్ రెడ్డి, సీఐ చరమందరాజు, తహసీల్దార్ బండా కవిత, ఎస్‌ఐలు, రైతులు పాల్గొన్నారు.
