మంత్రి ఇలాకాలోనే ఇలా ఉంటే.. మారుమూల పీహెచ్‌సీల పరిస్థితి ఇంకెంత దారుణం?

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నర్సింహా గౌడ్

ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సమస్య.. రోగులకు తప్పని ఇబ్బందులు

మంత్రి ఇలాకాలోనే ఇలా ఉంటే.. మారుమూల పీహెచ్‌సీల పరిస్థితి ఇంకెంత దారుణం?

ఆరు నెలలుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమే లేదు!

తక్షణమే సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నర్సింహా గౌడ్

మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా రోగులు, ముఖ్యంగా గర్భిణులు, మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నర్సింహా గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జుట్ల చిన్న హనుమంతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం బీఆర్ఎస్ పార్టీ బృందం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ నెలకొన్న మంచినీటి సమస్యను పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే, కొంతకాలం క్రితం ఆ ప్లాంట్ దెబ్బతిన్నప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం విచారకరమన్నారు.

కనీసం వాటర్ ప్లాంట్‌ను మరమ్మతు చేయించే పరిస్థితి కూడా ఆసుపత్రి అధికారుల్లో లేకపోవడం శోచనీయమని విమర్శించారు. గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రోగుల ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆరోపించారు.

ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు అవసరమైన వేడి నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలోని ఒక కేంద్రం నుంచి ప్రతిరోజూ వేడి నీరు తెచ్చుకుని కాలం గడుపుతున్నామని మహిళలు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. వెంటనే గర్భిణులు, బాలింతల కోసం వేడి నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఆరు నెలల క్రితం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మరో సమావేశం నిర్వహించలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. మంచినీటి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తమ స్థాయిలో పరిష్కరించే అవకాశం లేదని అక్కడి వైద్యులు, సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు.

వెంటనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించి, మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఇలాగే ఉంటే, మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు ఆరోపించారు.

అంతకుముందు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో టెలిఫోన్‌లో మాట్లాడారు. సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే తానే స్వయంగా మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి వాకిటీ శ్రీహరి, జిల్లా వైద్యాధికారి ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించి, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మొగిలప్ప, శివారెడ్డి, అభిరామ్ గౌడ్, అమ్రేష్, ఉప్పరి రఘు, ఎలిగండ్ల బాలప్ప, మారెప్ప, మహిమూద్, నర్సింలు నాయుడు, కె. ఆంజనేయులు, అశోక్ కుమార్ యాదవ్, నేతాజీ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, తిరుమలాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.